ఏది ఈర్ష్య?
మానవుని యొక్క జన్మమొదలు అంత్యము వరకు “ఈర్ష్య” అను గుణము వివిధ గుణగుణములతో బాటు యిమిడియున్నది. ఈ గుణము సమస్త జీవజాలముల(వృక్ష, పశు, పక్ష్యాదులు)లోను గోచరించును.
ఇది ఆదిలో సృష్టి నిర్మాణముతో ప్రారంభమై, ప్రళయకాలముతో నశించును. ఈర్ష్య జీవి యొక్క పురోగతిని దహింపజేసి తిరోగమన స్థితిని కలుగజేయును.
ఈర్ష్యచే విరోధము; విరోధముచే వైరము, వైరముచే అశాంతి, అశాంతిచే అనారోగ్యము, అనారోగ్యముచే ఆయుష్షు తగ్గి వినాశమునకు కారణ భూతము కాగలదు. ఉదాహరణ: కౌరవ పాండవుల కురుక్షేత్ర సంగ్రామము.
సాధన మార్గమున సాధకుడు ఈర్ష్య చే పరీక్షించగలడు.సామాన్య మానవుని యందు ఈర్ష్య వివిధ రూపము (కుల, మత, బంధు, జాతి, సంఘ, లింగ భేదము మొదలగు) లలో ప్రజ్వలింపజేయును. ఈనాడు ప్రపంచములో ఈర్ష్యచే, కారణభూతమై మహా మారణయంత్రములతో మనుష్య నాశనమునకు కాబడుచున్నాడు.
ప్రేమ, శాంతి, సహన, సమన్వయ భావము కలిగి జ్ఞానదీక్షాపరుడై, దీక్ష దక్షతతో స్థిత ప్రజ్ఞత గలిగినవాడు ఈర్ష్యను జయించగలడు. ఈ పై లక్షణములు సద్గురు ఆశీర్వాదముతో, ఆధ్యాత్మిక గ్రంధ పఠనము ద్వారా, ఆచరణలో పెట్టగలిగిన వాడు సాధించగలడు.